ప్లాస్టిక్ మనల్ని మింగేస్తోంది

                                                     ప్లాస్టిక్ మనల్ని మింగేస్తోంది



👉 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ కార్యాలయ సహాయక పర్యావరణ ఇంజనీర్ జి.స్వప్న...

👉 ఆదాని సిమెంట్స్ వారి సహకారంతో జాగృతి అభ్యుదయ సంఘం దేవాలయాలకు ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా తిరిగి వాడుకునే పర్యావరణ ఉత్పత్తుల ఉచిత పంపిణీ ప్రారంభం.



👉 నిత్యాన్నదానంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులే వాడుతున్నాము. PCB, జాగృతి అభ్యుదయ సంఘం ఇచ్చిన ప్రోత్సాహంతో తమ దేవాలయంలో సంపూర్ణంగా ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తాము... శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఛైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య.

👉ఛైర్మన్ గారి ప్రకటనకు అనుగుణంగా దేవాలయ కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు.


    పర్యావరణ పరిరక్షణ కోసం 16 సం.ల పైగా కృషి చేస్తున్న జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ సభాద్యక్షతన ఈరోజు సచివాలయ నగర్ శ్రీ శ్రీ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వేదికగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ కార్యాలయం ఆధర్యంలో జ్యూట్ బ్యాగ్ లు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు స్పూన్లు, ప్రసాదం డొప్పలను జాగృతి అభ్యుదయ సంఘం ద్వారా దేవాలయ కమిటీకు ఉచితంగా అందించడం జరిగింది. ఆదాని సిమెంట్స్ వారి ఆర్ధిక సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి కాలుష్య నియంత్రణ మండలి RR RO AEE జి.స్వప్న విచ్చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...





     ఉదయం కళ్లుతెరవగానే చేతికి అందే టూత్‌బ్రష్‌ నుంచి రాత్రి పడుకునేటప్పుడు కప్పుకునే బెడ్‌షీట్‌ వరకు మన జీవితం ప్లాస్టిక్‌తో ముడిపడి ఉంది. ఒకప్పుడు ప్లాస్టిక్‌ మన జీవితాలను సులభతరం చేసిన అద్భుత ఆవిష్కరణగా కనిపించింది. కానీ నేడు అదే ప్లాస్టిక్‌ మన ఆరోగ్యానికీ, మనుగడకీ ముప్పుగా మారింది.


మనం తినే ప్రతి ముద్దలో, తాగే ప్రతి చుక్క నీటిలో, పీల్చే ప్రతి శ్వాసలో తెలియకుండానే మైక్రోప్లాస్టిక్స్‌ అనే సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఒక సగటు మనిషి ప్రతి వారం సుమారు 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్‌ను శరీరంలోకి తీసుకుంటున్నాడు. అంటే వారానికి ఒక డెబిట్ లేదా క్రెడిట్ కార్డు బరువుతో సమానమైన ప్లాస్టిక్‌ను మింగుతున్నట్టే.



ప్లాస్టిక్‌ బాటిళ్లలోని నీరు, ప్లాస్టిక్‌ కవర్లలో వేడి ఆహారం, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, సముద్ర ఆహారం, ఉప్పు, కూరగాయలు, పండ్లు — ఇవన్నీ మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యానికి మూలాలుగా మారుతున్నాయి. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌లో నిల్వ చేయడం వల్ల కోట్లాది సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు ఆహారంలో కలిసిపోతాయి.


సముద్రాల్లో, నదుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు చిన్న చిన్న కణాలుగా విడిపోయి చేపలు, రొయ్యలు, ఇతర జలచరాల ద్వారా ఆహార గొలుసులోకి ప్రవేశిస్తున్నాయి. ఆ తరువాత అవే మన భోజనపళ్లెంలోకి చేరుతున్నాయి. అంతేకాదు, వ్యవసాయ భూముల్లోకి చేరిన మైక్రోప్లాస్టిక్స్‌ మొక్కల వేర్ల ద్వారా కూరగాయలు, ఆకుకూరల్లోకి కూడా ప్రవేశిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.


                         


అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ సూక్ష్మ కణాలు కేవలం జీర్ణవ్యవస్థలోనే ఉండిపోవడం లేదు. ఇవి రక్తప్రసరణ వ్యవస్థలోకి చేరి శరీరంలోని వివిధ అవయవాలకు వ్యాపిస్తున్నాయి. ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, గుండె, అంతేకాదు గర్భంలోని శిశువును రక్షించే జరాయువులో (Placenta) మరియు తల్లిపాలలో కూడా మైక్రోప్లాస్టిక్స్‌ ఆనవాళ్లు గుర్తించబడ్డాయి.


ప్లాస్టిక్‌లో ఉండే కొన్ని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి వంధ్యత్వం, థైరాయిడ్‌ సమస్యలు, పీసీఓడీ, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఇవి క్యాన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు.



ఈ ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం కష్టమే అయినప్పటికీ, మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.



✅ ప్లాస్టిక్‌ బాటిళ్లకు బదులుగా స్టీల్‌, రాగి, గాజు లేదా మట్టి పాత్రలను వాడాలి.

✅ వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌ డబ్బాల్లో నిల్వ చేయడం లేదా వేడి చేయడం మానేయాలి.

✅ ప్లాస్టిక్‌ కవర్లలో వేడి పదార్థాలు తీసుకోవడాన్ని తగ్గించాలి.

✅ పాలిస్టర్‌, నైలాన్‌ వంటి సింథటిక్‌ వస్త్రాల బదులుగా పత్తి, ఖాదీ, లినెన్‌ వస్త్రాలను ఉపయోగించాలి.

✅ ప్లాస్టిక్‌ టూత్‌బ్రష్‌లకు బదులుగా వెదురు బ్రష్‌లు, ప్లాస్టిక్‌ వంటసామగ్రికి బదులుగా చెక్క, ఇనుము లేదా స్టీల్‌ వస్తువులను ఎంచుకోవాలి.


ప్రకృతిని మనం ప్లాస్టిక్‌తో ఎంతగా కలుషితం చేశామో, ఇప్పుడు అదే ప్రకృతి ఆ ప్లాస్టిక్‌ను ఆహారం, నీరు, గాలి రూపంలో తిరిగి మనకే అందిస్తోంది. ప్లాస్టిక్‌ కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు; ఇది మన ఆరోగ్యంపై జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధం.

  

రాబోయే తరాల భవిష్యత్తును, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్‌పై ఆధారపడే జీవనశైలిని తగ్గించుకోవాలి. ప్రత్యామ్నాయాలను స్వీకరించాలి. ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యకరంగా జీవించే మార్గాన్ని ఎంచుకోవాలన్నారు.

 గుర్తుంచుకోండి... మనం ప్లాస్టిక్‌ను వాడుతున్నామని అనుకుంటున్నాం. కానీ నిజానికి ప్లాస్టిక్‌ మనల్ని మెల్లగా మింగేస్తోందన్నారు!

 కార్యక్రమంలో దేవస్థానం కమిటి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, అనూప్, శ్రీధర్, సలహాదారు శ్రీనివాస్, సిబ్బంది, సేవకులు, జాగృతి ప్రతినిధులు శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వర్రావు, శ్రీరాములు గౌడ్, సత్యనారాయణ, రమణయ్య, మహిళలు పాల్గొన్నారు....

భావన శ్రీనివాస్ 

ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం.

Comments