ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెగా సైకిల్ ర్యాలీ
*ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెగా సైకిల్ ర్యాలీ*
సాహెబ్ నగర్, వనస్థలిపురం, ఏప్రిల్ 21:
ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, జాగృతి ప్రతినిధులు పాల్గొన్న ఈ మెగా ర్యాలీని హయత్ నగర్ మండల విద్యా శాఖాధికారి (MEO) కె.శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ గారు మాట్లాడుతూ సైకిల్ ర్యాలీ కేవలం పొల్యూషన్ తగ్గించడమే కాకుండా భూమాత సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఒక్క సారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, చెట్ల పెంపకం, సహజ ఎరువులుతో భూసారం పెంచడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని జాగృతి అభ్యుదయ సంఘం సైకిల్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు.
పలు పర్యావరణ పరిరక్షణ నినాదాల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ షుమారు 150మంది విద్యార్థులు పాల్గొన్న మెగా సైకిల్ ర్యాలీ NBYNVSY జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమై రైతు బజార్, గణేష్ టెంపుల్, రెడ్ వాటర్ ట్యాంక్, సచివాలయ నగర్ ప్రాంతాల మీదుగా షుమారు 2 కిలోమీటర్లు కొనసాగింది.
సైకిల్ ర్యాలీ ద్వారా యువత ప్రకృతి పరిరక్షణపై బాధ్యతను గుర్తు చేసిందని, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ నేపధ్యంలో తలెత్తుతున్న పెట్రోల్, గ్యాస్ కొరతను అధిగమించేందుకు ప్రజలు సోలార్ ఎనర్జి, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోగ్యాస్ లాంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో చైతన్యం పెంచుతాయని వారు పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.వి.దినేష్ మాట్లాడుతూ తమ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్ధుల సహకారంతో జీరో ప్లాస్టిక్ స్కూల్ గా తీర్చిదిద్ది మిగిలిన పాఠశాలలకు మార్గదర్శకంగా నిలుస్తామన్నారు.
ర్యాలీ అనంతరం జాగృతి అభ్యుదయ సంఘం విద్యార్ధులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేయడమైనది.
కార్యక్రమంలో... ఇస్మాయిల్ గురూజి, జాగృతి ప్రతినిధులు శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వర్రావు, బచ్చనబోయిన యాదయ్య యాదవ్, ఎ.సత్యనారాయణ, నర్సింహులు, కె.వి.రమణయ్య, పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్, నాగశేషు, విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.
Comments
Post a Comment