ఇంద్ర ధనుస్సును తలపించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు
*ఇంద్ర ధనుస్సును తలపించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు*
👉 జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ, పరిసర కాలనీల మహిళలు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా సైన్స్ తో ముడిపడి ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించాలనే ఆలోచనతో జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సాహెబ్ నగర్ డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలని సాయి మందిరం వేదికగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతితోపాటు దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ నినాదాలతో నిన్న సాయంత్రం జరిగిన ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు పంచాగ్నుల జయశ్రీ, జీని శ్రీలత, గాయత్రి గార్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీల్లో మొదటి బహుమతి ₹ 3000/- నగదును శ్రావ్య, రెండవ బహుమతి ₹ 2000/- పార్వతి, మూడవ బహుమతి ₹ 1000/- సహస్ర లు గెల్చుకోగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక, ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి 3వేలు కాలనీ పెద్దలు దుబాయ్ రాజా, మూడవ బహుమతి 1వెయ్యిని SKN కళాక్షేత్రం వారు స్పాన్సర్ చేయగా 2వ బహుమతి 2వేలు, 60మందికి ప్రోత్సాహక బహుమతులను 'మొదటి ముద్ద' యాజమాన్యం స్పాన్సర్ చేశారు.
సంక్రాంతి వస్తుందంటే మహిళలందరికీ అదో రకమైన ఉత్సాహం. ధనుర్మాసం మొదలవగానే మహిళలంతా ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుఝామునే ఆవుపేడతో ఇళ్ళముందు కళ్ళాపు చల్లి రాతి ముగ్గు, బియ్యపు పిండితో రంగు రంగుల ముగ్గులు వేసి ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి, రేగిపండ్లు, గరికను ఉంచి ఆట పాటలతో సందడి చేయడం కనిపిస్తుంది. హరిదాసు సంకీర్తనలతో, డూ డూ బసవన్న విన్యాసాలతో పండుగ మూడు రోజులను ఎంతో సంతోషంగా జరుకుంటారు హిందూ సోదరులు. మకర సంక్రమణం జరిగే రోజు సంక్రాంతి అని క్రాంతి అనగా వెలుగు అని, ఇప్పటిదాక రోజులో అధిక సమయం చీకటి ఉంటుందని, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి నుండి పగటి పూట వెలుతురు సమయం పెరుగుతూ ఉంటుందని, గరిక సూర్యుని నుండి వచ్చే హానికారక UV కిరణాలను అదుపు చేస్తుందని, రేగిపండ్లు, రేగి చెట్టు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని, ఆవుపేడ రేడియేషన్ నుండి, యాంటీ బ్యాక్టీరియల్ గా పని చేస్తుందని, బియ్యం పిండి చీమలకు ఆహారం అని, నువ్వులతో చేసిన అరిసెలు తింటే శరీరంలో వేడి, వాము వేసి చేసిన సకినాలు తినడం వలన అరుగుదల శక్తి పెరుతుందని, ఇలాంటి పండుగల వెనుక ఉన్న ఉద్దేశం అంతా సైన్సే అని వాటిని యధావిధిగా కొనసాగించడం మానవాళి, జీవరాశి మనుగడకు అవసరం అని వక్తలు అభిప్రాయపడ్డారు.
భవన శ్రీనివాస్ సభాద్యక్షతన జరిగిన బహుమతుల పంపిణీ కార్యక్రమంలో ప్రముఖ వాస్తు నిపుణులు పెంటపాటి కృష్ణాదిశేషు, సి.హెచ్.వి.ఆర్.కె.మూర్తి, పోటీల సమన్వయ కర్తలు గాయత్రి, హేమలత, శ్రీదేవిలతో పాటు సాయిమందిరం కమిటి ప్రతినిధి సరస్వతి, సాహెబ్ నగర్ డివిజన్ పలు కాలనీల ప్రతినిధులు, గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ ప్రముఖులు మనోజ్, దయాకర్ ముదిరాజ్, మధుసూధన్ రెడ్డి, రమేష్, మూర్తి, శరత్ నలమర్ల, ఆంజనేయులు, శ్యామ్ గౌడ్, నరసింహ, మల్లయ్య, గోపాల్ దాస్ రాము, శ్రీరాములు గౌడ్, ఓబులేష్ యాదవ్, దుర్గాప్రసాద్, వెంకట నారాయణ, రఘు, వెంకట లక్ష్మీ, కవితాగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
భావన శ్రీనివాస్
*ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం*

Comments
Post a Comment